‘బాహుబలి 2: ది కంక్లూజన్’ మూవీ రివ్యూ

BAHUBALI

సినిమా : బాహుబలి 2: ది కంక్లూజన్
న‌టీన‌టులు : ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్, తమన్నా, నాజ‌ర్ త‌దిత‌రులు
సంగీతం : ఎమ్ ఎమ్ కీరవాణి
దర్శకత్వం : ఎస్ ఎస్ రాజమౌళి
నిర్మాత : శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని,

రెండేళ్లుగా ఎదురుచూస్తున్న సినిమా థియేట‌ర్ల‌ల‌లో అడుగుపెట్టింది. బాహుబ‌లి , క‌ట్ట‌ప్ప వ్య‌వ‌హారం వేయి క‌ళ్ల‌తో ఎదురు చూసిన వాళ్ల‌కు స‌మాధానం దొరికింది. ఫ‌స్ట్ పార్ట్ ప్ర‌పంచ వ్యాప్త విజ‌యం ద‌క్కించుకోవ‌డంతో సెకండ్ పార్ట్ మీద అంచ‌నాలు అంద‌నంత ఎత్తులోకి వెళ్లాయి. అసలు కథ నడిచే బాహుబలి 2పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. భారీ యుద్ధ సన్నివేశాలతో పాటు తొలి భాగంలో మిస్ అయిన రాజమౌళి మార్క్ డ్రామా, ఎమోషన్స్ ను సీక్వల్ లో చూడొచ్చన్న హైప్ క్రియేట్ చేశారు. మ‌రి బాహుబ‌లి 2 అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా ఉందా..రాజ‌మౌళి మీద ప్రేక్ష‌కుల అంచ‌నాలు నిజ‌మ‌య్యాయా..ఈ రివ్యూలో చూద్దాం.

స్టోరీ :
రాజుగా బాధ్య‌త‌ల స్వీక‌రించిన త‌ల్లి శివ‌గామి దేవి ఆదేశాల‌తో ప్ర‌పంచ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరుతాడు బాహుబ‌లి. క‌ట్ట‌ప్ప తోడుగా తీసుకుని ప‌రిస్థితులు తెలుసుకోవ‌డానికి వెళ‌తాడు. అలా తిరుగుతున్న క్ర‌మంలో కుంత‌ల రాజ్య యురాణి దేవ‌సేన తో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆమె కోసం కుంత‌ల రాజ్యంలో అతిథులుగా ఉండిపోతారు. భ‌ల్లాల దేవుడికి ఈ విష‌యం తెలిసి తానే దేవ‌సేన‌ను ద‌క్కించుకోవాల‌నుకుంటాడు. బాహుబ‌లి కన్నా ముందే శివ‌గామిని క‌లిసి తాను దేవ‌సేన‌ను సొంతం చేసుకోవాల‌నుకుంటున్న విష‌యం చెప్పి ఆమె ద‌గ్గ‌ర మాట తీసుకుంటాడు.

కొడుకు భ‌ల్లాల‌ కోసం దేవ‌సేన కుంత‌ల రాజ్యానికి వ‌ర్త‌మానం పంపుతుంది. అయితే శివ‌గామి తీరు న‌చ్చని దేవ‌సేన ఆమె బ‌హుమ‌తులు కూడా వెన‌క్కి పంపుతుంది. దాంతో శివ‌గామికి ఆగ్ర‌హం వ‌స్తుంది. కానీ బాహుబి, క‌ట్ట‌ప్ప మాత్రం దేవ‌సేన‌ను ఒప్పించి మ‌హిస్మృతి రాజ్యానికి తీసుకొస్తారు. వ‌చ్చిన త‌ర్వాత గానీ బాహుబ‌లికి అస‌లు విష‌యం తెలియ‌దు. దేవసేన అభిప్రాయం తెలుసుకోకుండా రాజమాత తీసుకున్న నిర్ణయాన్ని బాహుబలి తప్పు పడతాడు. దీంతో బాహుబలి మీద కోపంతో రాజమాత శివగామి దేవి, భల్లాలదేవుడిని రాజుగా, బాహుబలిని సైన్యాధ్యక్షుడిగా ప్రకటిస్తుంది. రాజుగా పట్టాభిషేకం జరిగిన తరువాత బాహుబలిని ఎలాగైన రాజమాతకు దూరం చేయాలనుకున్న భల్లాలదేవుడు, తండ్రి బిజ్జలదేవుడితో కలిసి కుట్రలు పన్ని బాహుబలి, దేవసేనలపై అంతఃపుర బహిష్కరణ శిక్ష వేయిస్తాడు. కోటకు దూరమైన బాహుబలి.. సామాన్యులతో కలిసి ఉంటూ అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుంటాడు.

ఇది సహించలేని భల్లాలదేవుడు.. బాహుబలి బతికుండగా తనకు రాజుగా గుర్తింపు రాదని ఎలాగైన బాహుబలిని చంపేయాలని నిర్ణయించుకుంటాడు. బాహుబలి మామా అని ఆప్యాయంగా పిలుచుకునే కట్టప్పతోనే బాహుబలిని చంపిస్తాడు. అసలు బాహుబలిని చంపడానికి కట్టప్ప ఎందుకు అంగీకరించాడు…? భల్లాలదేవుడు చేసిన మోసాలు రాజమాత శివగామి దేవికి తెలిసాయా..? భల్లాలదేవుడు శివగామిని ఎందుకు చంపాలనుకున్నాడు..? మహేంద్ర బాహుబలి, భల్లాలదేవుడ్ని ఎలా అంతమొందించాడు.? అన్నదే మిగతా కథ.

bahubali

ప్ల‌స్:-
-విజువ‌ల్స్
-ప్ర‌భాస్ , రానా

మైన‌స్:-
-క‌థ‌
-పాట‌లు

ఫెర్మార్మెన్స్ :

బాహుబ‌లి పాత్ర‌లో ప్ర‌భాస్ పూర్తిగా ఒదిగిపోయాడు. నాలుగున్నరేళ్ల పాటు ఒక్క క్యారెక్ట‌ర్ కోసం శ్ర‌మించి తీరుకి ఫ‌లితం ద‌క్కింది. ఫ‌స్ట్ పార్ట్ మాదిరిగానే యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఇలా ప్రతీ దాంట్లో అద్భుతమైన నటనతో అలరించాడు. లుక్స్ పరంగా తాను తప్ప బాహుబలికి మరో నటుడు సరిపోడేమో అన్నంతగా ఆకట్టుకున్నాడు ప్రభాస్. బాహుబ‌లికి ధీటుగా భ‌ల్లాల దేవుడిగా రానా కూడా అదుర్స్ అనిపించుకున్నాడు. ఇటీవ‌లే గాజాతో స‌క్సెస్ కొట్టిన రానాకు భ‌ల్లాల దేవుడి పాత్ర మ‌రిచిపోలేని రీతిలో ఉంది. క్రూరత్వం, కండబలం కలిగిన బల్లాలదేవుడిగా రానా నటనకు థియేటర్లు మోత మొగిపోతున్నాయి.

మరో కీలక పాత్ర రాజమాత శివగామి దేవి హుందాతనంతో రాజకీయ చతురత కలిగిన రాజమాతగా రమ్యకృష్ణ ఆకట్టుకుంది. రాజరిక కట్టుబాట్లు, పెంచినపాశం మధ్య నలిగిపోయే తల్లిగా ఆమె నటన అద్భుతం. ఇక ఫ‌స్ట్ పార్ట్ లో కొన్ని స‌న్నివేశాల‌కు మాత్రమే పరిమితమైన అనుష్క, రెండో భాగంలో దేవ‌సేన గా ఆకట్టుకుంది. అందంగా కనిపిస్తూనే, యుద్ధ సన్నివేశాల్లోనూ సత్తా చాటింది. త‌మ‌న్నా పాత్ర చివ‌రిలో మాత్ర‌మే ఉంటుంది. కుమార వర్మగా సుబ్బరాజు ఫస్ట్ హాఫ్ లో కామెడీ పండించాడు. కట్టప్పగా సత్యరాజ్, బిజ్జలదేవుడిగా నాజర్, ఇతన నటీనటులు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

టెక్నిక‌ల్ టీమ్ :

ఈ విజువ‌ల్ వండ‌ర్ కోసం తపస్సు చేసిన రాజమౌళి ప‌నితీరు అద్భుతం అనిపిస్తుంది. బాహుబలి 1స్థాయికి మించి విజువల్ ఎఫెక్ట్స్, భారీ యుద్ధ సన్నివేశాలతో పాటు ఎమోషన్స్, డ్రామాతో సినిమాను తీర్చిదిద్దాడు. గ్రాఫిక్స్, సినిమాటోగ్రఫి, సంగీతం ఇలా ప్రతీ అంశంలోనూ ది బెస్ట్ అనిపించుకునే స్థాయిలో సినిమాను రూపొందించాడు. ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన అంశం గ్రాఫిక్స్. హాలీవుడ్ సినిమాల స్థాయికి ఏ మాత్రం తీసిపోని గ్రాఫిక్స్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహిష్మతి రాజ్యం, పాటు యుద్ధ సన్నివేశాల్లో ఏది గ్రాఫిక్స్ లో క్రియేట్ చేశారో.. ఏది రియల్ గా షూట్ చేశారో అర్ధం కానంత నేచురల్ గా ఉన్నాయి గ్రాఫిక్స్. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో కమల్ కణ్నన్ టీం కృషి సినిమా స్థాయిని పెంచింది.

కీరవాణి నేపథ్య సంగీతం సినిమా కు త‌గ్గ‌ట్టుగా ఉంది. కానీ పాట‌లు మాత్రం సినిమాకు త‌గ్గ‌ట్టుగా లేవ‌ని చెప్ప‌వ‌చ్చు. సాహోరె బాహుబలి, దండాలయ్య పాటలు తప్ప మిగతావి పెద్దగా ఆకట్టుకోలేదు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అంతర్జాతీయ స్థాయిలో ఉంది. రాజమౌళి ఊహను తెర మీదకు తీసుకొచ్చేందుకు సెంథిల్ ఎన్నో ప్రయోగాలు చేశాడు. కోటగిరి వెంకటేశ్వరావు ఎడిటింగ్, రమా రాజమౌళి, ప్రశాంతిల స్టైలింగ్, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్ ఇలా ప్రతీ అంశం బాహుబలి అంతర్జాతీయ సినిమాగా రూపొందేందుకు సాయపడ్డాయి.

ఎనాలిసిస్

పూర్తిగా విజువ‌ల్స్ వండ‌ర్ మువీ ఇది. ఫ‌స్ట్ పార్ట్ కి మించిన ఎమోష‌న్స్ ఉన్నాయి. అయితే అంచ‌నాలు ఏమేర‌కు నిల‌బెట్టుకున్నార‌న్న‌ది మాత్రం సందేహ‌మే. పూర్తిగా గ్రాఫిక్స్ , టెక్నిక‌ల్ అంశాల‌కే ప్రాధాన్యం ఇవ్వ‌డంతో క‌థ‌లో ప్ర‌త్యేక‌త లేదు. అయినా స్క్రీన్ మీద రిచ్ నెస్ చూపించ‌డంలో స‌క్సెస్ అయిన రాజ‌మౌళి స‌గ‌టు ప్రేక్ష‌కుడిని కూడా మెప్పించ‌డంలో విజ‌యవంతం అయిన‌ట్టేన‌ని భావించ‌వ‌చ్చు.

పంచ్ లైన్: అంచ‌నాలుకు త‌గ్గ‌ట్టుగానే బాహుబ‌లి2
updateap రేటింగ్ : 3.5/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter