శిల్పా చేరిక‌పై వైసీపీలో భిన్నాభిప్రాయాలు

ysrcp

నంద్యాల రాజ‌కీయాలు న‌యా మ‌లుపుతిరుగుతున్నాయి. చాలాకాలంగా ఊహించిన‌ట్టుగానే బాబు ప‌ఠించిన భూమా మంత్రం బెడిసికొట్టింది. ఒకే ఒర‌లో రెండు క‌త్తులు ఇమిడే అవ‌కాశం లేద‌ని తేలిపోయింది. నంద్యాలలో భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికి బై పోల్స్ టికెట్ దాదాపు ఖ‌రారు కావ‌డంతో శిల్పా జెండా మార్చేస్తున్నారు. జ‌గ‌న్ స‌మ‌క్షంలో కండువా క‌ప్పుకోబోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఫ్యాన్ పార్టీలో ఆయ‌న చేరిక క‌న్ఫ‌ర్మ్ అయిపోయింది.

అయితే శిల్పా రాక‌మీద వైసీపీలోని ఓ వ‌ర్గం అసంతృప్తిగా ఉంది. రాజ‌కీయ అవ‌స‌రాల కోసం పార్టీ మారుతున్న వారిని ప్రోత్స‌హించ‌డం ద్వారా జ‌గ‌న్ కూడా చంద్ర‌బాబు మాదిరే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. శిల్పా మోహ‌న్ రెడ్డి లాంటి అవ‌కాశ‌వాదుల‌ను ఆద‌రించ‌డం అస‌లుకే మోసం తెస్తుంద‌నే ఆందోళ‌న కూడా వ్య‌క్తం చేస్తున్నారు. అందులోనూ శిల్పా బ్ర‌ద‌ర్స్ చెరోవైపు ఉండాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం ద్వారా వారి రాజ‌కీయా ప్ర‌యోజ‌నాలు చూసుకుంటున్న స‌మ‌యంలో జ‌గ‌న్ వారికి కండువా క‌ప్ప‌డం కొరివితో త‌ల‌గోక్కోడం అవుతుంద‌ని కొంద‌రు అంటున్నారు. పార్టీని న‌మ్ముకున్న వారిని ప‌క్క‌న పెట్టేసి ఇలాంటి అవ‌కాశ‌వాదుల‌ను ప్రోత్స‌హిస్తే ఆ త‌ర్వాత ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌నే సూచ‌న‌లు చేస్తున్నారు.

మ‌రికొంద‌రు నేత‌లు మాత్రం ఇలాంటి వాద‌న‌లు కొట్టిపారేస్తున్నారు. రాజ‌కీయ పార్టీలో చేరుతున్న నేత‌ల్లో అన్ని ర‌కాల వాళ్లు ఉంటార‌ని, మ‌డిగ‌ట్టుకుని కూర్చుకుంటే మొన్న‌టి ఎన్నిక‌ల ఫ‌లితాలే పున‌రావృతం అవుతాయ‌ని గ్ర‌హించాలంటున్నారు. రాజ‌కీయాల‌ను రాజ‌కీయంగా ఎదుర్కోవాలే త‌ప్ప సూటిగా ఉండాలంటే అన్ని సంద‌ర్భాల్లోనూ సాధ్యం కాద‌నే విష‌యాన్ని గుర్తించాలంటున్నారు. నంద్యాల‌లో శిల్పా రాక‌తో పార్టీకి అద‌న‌పు బ‌ల‌మే త‌ప్ప న‌ష్టం లేద‌ని చెబుతున్నారు. ఇంకా ప‌లువురు నేత‌లు పార్టీలో చేర‌డానికి సంసిద్ధులుగా ఉన్న త‌రుణంలో కొత్త వారి వ‌ల్ల పార్టీ కోసం ప‌నిచేసిన వారికి న‌ష్టం రాకుండా జాగ్ర‌త్త‌లు ప‌డితే స‌మ‌స్య‌లుండ‌వ‌ని చెబుతున్నారు.

ఏమైనా శిల్పా చేరిక మాత్రం వైసీపీలో రెండు వాద‌న‌ల‌కు అవ‌కాశం ఇచ్చింది. అస‌లే వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాల‌కు ప్రాధాన్య‌త ఎక్కువ‌గా ఉండే రాయ‌ల‌సీమ రాజకీయాల్లో ఈ ప‌రిణామాలు ఎలాంటి ప్ర‌భావం చూపిస్తాయో చూడాలి. ఇక ఇప్ప‌టికే నంద్యాల వ్య‌వ‌హారాల‌ను త‌మ చుట్టూ తిప్పుకోవాల‌ని ఆశిస్తున్న గంగుల బ్ర‌ద‌ర్స్ తో శిల్పా మోహ‌న్ రెడ్డి ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న‌ది కూడా ఆస‌క్తిదాయ‌క‌మే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter