రివ్యూ 2016: తెలంగాణా ట‌ర్న్ తీసుకోబోతోందా..?

kcr telangana

ఒక్క ఏడాదిలోనే తెలంగాణా రాజ‌కీయాల్లో పెను మార్పులు జ‌రిగిపోయాయి. 2016 ఆరంభం నాటికి అధికార పార్టీకి తిరుగులేదు. విప‌క్షాల‌కు ఊపు లేకపోవ‌డంతో పాల‌క‌ప‌క్షం ప‌ట్టు సాధించి అంద‌రినీ ఉక్కిరిబిక్కిరి చేసింది. కారు స్పీడుతో అన్ని పార్టీలు బేజారెత్తిపోయాయి. తొలి మాసంలో జ‌రిగిన గ్రేట‌ర్ ఎన్నిక‌లు మొద‌లుకుని ఖ‌మ్మం వ‌ర‌కూ అన్ని చోట్లా పాల‌క‌ప‌క్షం త‌న స‌త్తా నిరూపించుకుంది. తొలి ఆరు నెల‌ల్లో కేసీఆర్ స‌ర్కారుకి న‌ల్లేరు మీద న‌డ‌క‌లా సాగిపోయింది.

కానీ ద్వితీయార్థం వ‌చ్చే స‌రికి టీఆర్ఎస్ తీరు మారింది. విధానాల‌లో దూకుడుపెంచింది. రాజ‌కీయంగా ఎదురుదాడి చేసింది. అయిన‌ప్ప‌టికీ మ‌ల్ల‌న్న సాగ‌ర్ నుంచి న‌యిం విష‌యం వ‌ర‌కూ అనేక వ్య‌వ‌హారాల్లో ప్ర‌జ‌ల్లో అవిశ్వాసాన్ని చూర‌గొన్న‌ది. మ‌ల్ల‌న్న సాగ‌ర్ వ్య‌వ‌హారంలో ఏకంగా హైకోర్ట్ కూడా స‌ర్కారుకి మొట్టి కాయ‌లు వేయాల్సి వ‌చ్చింది. న‌యీం విష‌యంలో సీబీఐ విచార‌ణ‌కు అంగీక‌రించ‌క‌పోవ‌డం, డైరీ బ‌య‌ట‌పెట్ట‌క‌పోవ‌డం వంటి అనేక చ‌ర్య‌ల‌తో ద్వారా టీఆర్ఎస్ ను ప్ర‌జ‌లు అనుమానించే ద‌శ వ‌చ్చేసింది. టీజేఏసీ త‌గువు కూడా తార‌స్థాయికి చేరుకుని కోదండ‌రామ్ స్వ‌యంగా దీక్ష‌కు దిగే వ‌ర‌కూ వ‌చ్చింది. దాంతో కేసీఆర్ ఇమేజ్ కి కొంత డ్యామేజ్ జ‌రిగింది.

అదే స‌మ‌యంలో డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయ‌డం ద్వారా కొంత సానుకూల‌త స‌ర్కార్ కి ల‌భించింది. దానికితోడుగా ప్ర‌గ‌తి భ‌వ‌న్ పేరుతో కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో సీఎం క్యాంపాఫీస్ నిర్మాణం కొంద‌రికి గిట్ట‌లేదు. ఇక మిష‌న్ కాక‌తీయ‌లో అవినీతి ఆరోప‌ణ‌లు స‌ర్కారుకి పంటికింద రాళ్ల‌లా మారుతున్నాయి. గ్రేట‌ర్ లో అవినీతి వ్య‌వ‌హారాలు బ‌య‌ట‌ప‌డినా స‌కాలంలో స్పందించ‌క‌పోవ‌డం, ఏకంగా మంత్రిగారి అండ‌తో క‌ట్టిన అక్ర‌మ నిర్మాణం కుప్ప‌కూల‌డం వంటి ఘ‌ట‌న‌లు కేసీఆర్ స‌ర్కారుకి కొంత చెడ్డ పేరు తీసుకొచ్చాయి.

మ‌రోవైపు రాజకీయంగా చూస్తే విప‌క్షాల‌న్నీ కోలుకోలేని స్థితిలో ఉండ‌డంతో కారుకి తిరుగులేని స్థితి కొన‌సాగుతోంది. కాంగ్రెస్ సార‌ధ్యంలోనే స‌ఖ్య‌త లేదు. టీడీపీ దాదాపుగా కుదేల‌వుతోంది. లెఫ్ట్ ప్ర‌య‌త్నాలు ఫ‌లించే అవ‌కాశం లేదు. వైఎస్సార్సీపీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో టీఆర్ఎస్ ఇప్ప‌టికీ ధీమాగా ఉండ‌వ‌చ్చు. అందుకే కేసీఆర్ న‌గ‌దు మార్పిడి విష‌యంలో మాట మార్చినా మంది త‌న వెంటే ఉంటార‌న్న ధీమాతో సాగుతున్నారు. బీజేపీతో స్నేహం పెంచుకుంటూనే క్యాబినెట్ లో చేర‌డానికి స‌త‌మ‌తం అవుతున్నారు. తెలంగాణాలో మైనార్టీల ప్ర‌భావం బాగా తెలిసిన కేసీఆర్ త‌న కూతురు క‌విత‌ను క్యాబినెట్ మంత్రిని చేసేయాల‌న్న ఆలోచ‌న‌ను అణచివేసుకుంటున్నారు. దాంతో బీజేపీతో స్నేహంతో భేటీల వ‌ర‌కూ, ఎయిర్ పోర్ట్ లో మోడీతో ప్ర‌త్యేక మాట‌మంతీ వ‌ర‌కేనా అన్న అనుమానం క‌లుగుతోంది.

కేసీఆర్ బాగా క‌లిసొచ్చిన విష‌యాల్లో ఒక‌టి ఏపీ సీఎం చంద్ర‌బాబు బ‌ల‌హీన‌త అయితే రెండు తెలంగాణాలో విప‌క్షాల దుస్థితి. అందుకే 2015 స్థాయిలో కాక‌పోయినా 2016లో కూడా టీఆర్ఎస్ ధీమాగా సాగిపోయింది. అయినా ఇది ఎల్ల‌కాలం ఇలానే ఉంటుంద‌ని భావించ‌డం రాజ‌కీయా్లో కుద‌ర‌దు. కాబ‌ట్టి 2017 ఎలాంటి ట‌ర్న్ తీసుకుంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter