బాబుకి భారంగా మారిన టీమ్

ap cabinet1

మూడు నెల‌ల‌య్యింది. టీమ్ 2019 అని చెప్పారు. క్యాబినెట్ విస్త‌ర‌ణ‌లో భాగంగా చంద్ర‌బాబు కొత్త వ్యూహంతో ముందుకెళుతున్నార‌నే ప్ర‌చారం చేశారు. కానీ ఇప్పుడు అదే వ్యూహం కొంప‌ముంచేలా క‌నిపిస్తోంది. పార్టీ ప‌రువు తీసేలా సాగుతోంది. ఇప్ప‌టికే నంద్యాల వ్య‌వ‌హారం ఓ ఉదాహ‌ర‌ణ‌గా క‌నిపిస్తోంది. భూమా కుటుంబం నుంచి అఖిల‌ప్రియ‌కు క్యాబినెట్ లో అవ‌కాశం ఇచ్చినా ప్ర‌యోజ‌నం లేద‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. అమె అనుభ‌వం, వ్య‌వ‌హార ధోర‌ణి, స‌మ‌న్వ‌య లేమి క‌లిసి టీడీపీకి లాభం క‌న్నా న‌ష్టం ఎక్కువ తెస్తుంద‌నే పార్టీ నేత‌లే అభిప్రాయ‌ప‌డుతున్నారు. క‌ర్నూలు జిల్లాలో కీల‌క సామాజిక‌వ‌ర్గాన్ని మ‌చ్చిక చేసుకోవ‌చ్చ‌ని ఆశిస్తే, చివ‌ర‌కు నంద్యాల‌లో కూడా ఆమె ప్ర‌భావం స‌న్న‌గిల్లుతోంద‌ని చెబుతున్నారు. వ‌ర‌కు సొంత శాఖ‌లోనూ ప్ర‌భావం చూప‌లేక‌పోవ‌డంతో చాలామంది పెద‌వి విరుస్తున్నారు. కీల‌క టూరిజం శాఖ బాధ్య‌త‌లు అప్ప‌గించినా మూడు నెల‌ల్లో ఒక్క‌టి కూడా ప్ర‌భావితం చేసే కార్యక్ర‌మానికి పూనుకోక‌పోవ‌డం దానికి కార‌ణం అంటున్నారు.

ఇక ఫిరాయింపు ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ రెడ్డికి మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌డం ద్వారా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాలు పున‌రావృతం చేస్తామ‌ని భీక‌రంగా చెప్పినా మూడు నెల‌ల్లో మంత్రిగారి ప్ర‌ద‌ర్శ‌న పేల‌వంగా క‌నిపిస్తోంది. క‌డ‌ప జిల్లాలో మంత్రి తీరుతో పార్టీ మూడు ముక్క‌లుగా మారుతోంది. ఇప్ప‌టికే సీఎం ర‌మేష్ అనుకూల‌, వ్య‌తిరేక వ‌ర్గాలుగా ఉన్న పార్టీ ఇప్పుడు మంత్రి వ్య‌తిరేకులంతా ఒక్క‌టేన‌నే వ‌ర‌కూ వ‌చ్చేసింది. జ‌మ్మ‌ల‌మ‌డుగులో రామ‌సుబ్బారెడ్డి వ‌ర్గం గ‌రంగ‌రంగా ఉంది. చివ‌ర‌కు సీఎం ర‌మేష్ మీద దాడి చేసే స్థాయికి వెళ్లింది. ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టుగా ఎమ్మెల్సీ ప‌ద‌వి రాక‌పోతే జెండా పీకేయ‌డం ఖాయ‌మ‌ని రామ‌సుబ్బారెడ్డి శిబిరం చెబుతుండ‌డంతో క‌డ‌ప‌లో అంతంత‌మాత్రంగా ఉన్న టీడీపీ మ‌రింత చ‌తికిల‌ప‌డుతుంద‌ని చెబుతున్నారు. ఇక జిల్లాలో ఎస్పీ స‌హా అధికారుల‌తో మంత్రి త‌గాదా పెట్టుకోవ‌డం మిన‌హా పార్టీకి ప్ర‌యోజ‌నం క‌లిగించేలా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని నేత‌లంటున్నారు.

బొబ్బిలి నుంచి గెలిచిన సుజ‌య‌కృష్ణ రంగారావు సీన్ కూడా అదే రీతిలో ఉంది. బొబ్బిలి రాజుల‌కు ప్రాధాన్య‌త ద‌క్క‌డంతో విజ‌య‌న‌గ‌ర సామ్రాజ్యానికి అధినేత‌గా ఉన్న అశోక్ గ‌జ‌ప‌తికి కంట‌గింపుగా మారింది. పార్టీ వ్య‌వ‌హారాల్లో అంటీముట్ట‌న‌ట్టుగా ఉంటున్నా జిల్లా పార్టీ అధ్య‌క్ష‌ప‌ద‌వి విష‌యంలో ఆయ‌న ప‌ట్టుప‌డుతున్న తీరుతో పార్టీ అభాసుపాల‌వుతోంది. జిల్లాల్లో పార్టీ రెండు శిబిరాలుగా మారిపోతోంది. చిత్తూరులో అమ‌ర్ నాథ్ రెడ్డికి ప‌ద‌వి ఇచ్చిన త‌ర్వాత అసంతృప్తి జెండా ఎగ‌రేసిన బొజ్జ‌ల కుటుంబీకులు ఇప్ప‌టికీ ప్ర‌త్యామ్నాయం ఆలోచ‌న‌ల నుంచి వెన‌క్కి వ‌చ్చిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. గుంటూరులో రావెల కిషోర్ ని తీసేసి న‌క్కా ఆనంద్ బాబుకి అవ‌కాశం ఇచ్చినా ఆయ‌న మాత్రం రాజకీయంగా ప్ర‌భావం చూప‌లేక‌పోతున్నారు. త‌ప్పో ఒప్పో నిత్యం రావెల విప‌క్షం మీద ఎదురుదాడి చేస్తుండేవారు. కానీ న‌క్కా మాత్రం ఆ స్థాయిలో క‌నిపించ‌డం లేదు.

ప‌శ్చిమ నుంచి పితానికి, జ‌వ‌హార్ కి చోటివ్వ‌డంతో పార్టీ రెండుగా విడిపోయింది. చివ‌ర‌కు చింత‌మ‌నేని మీద టీడీపీ నేత‌లే హత్య‌కు సుఫారీ ఇచ్చిన వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపింది. సొంత శాఖ‌ల వ్య‌వ‌హారాలు త‌ప్ప జిల్లాలో పార్టీ ప‌రిస్థితిని చ‌క్క‌దిద్ద‌డం ఈ మంత్రుల వ‌ద్ద జ‌రిగే ప‌నికాదంటున్నారు. నెల్లూరులో సోమిరెడ్డి రాక త‌ర్వాత మంత్రి నారాయ‌ణ సొంత జిల్లాకు ప్రాధాన్య‌త త‌గ్గించార‌ని అంటున్నారు. రాజ‌కీయంగానూ విప‌క్షం మీద ఎదురుదాడికి నారాయ‌ణ ప్రాధాన్య‌త‌నిస్తున్న‌ట్టుగా లేదు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత నారాయ‌ణ వ్య‌వ‌హార శైలిలో వ‌చ్చిన మార్పు దానికి కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. శ్రీకాకుళంలో క‌ళా వెంక‌ట్రావుకి అవ‌కాశం రావ‌డంతో అచ్చెన్న‌తో ఆయ‌న వైరం బాహాటంగానే క‌నిపిస్తోంది. విశాఖ‌లో అయ్య‌న్న‌. గంటా వైరం పార్టీ ప‌రువును స‌ముద్రం పాలుజేస్తోంది.ఇక వారితో పాటుగా మంత్రివ‌ర్గంలో అవ‌కాశం కోసం ఎదురుచూసి నిర‌శ చెందిన బ్యాచ్ అంతా ఇప్పుడు పార్టీ ప్ర‌యోజ‌నాల క‌న్నా త‌మ సొంత గూటిని స‌ర్థుకోవ‌డానికే ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. బోండా ఉమా ,బుచ్చ‌య్య చౌద‌రి, ధూళిపాళ‌, ప‌య్యావుల వంటి నోరున్న నేత‌లెవ‌రూ పార్టీ విధానాల‌పై పెద‌వి విప్ప‌డం లేదు. దాంతో రాజ‌కీయంగా టీడీపీ బ‌ల‌హీన‌ప‌డుతున్న‌ట్టుగా ప్ర‌జ‌లు భావించాల్సి వ‌స్తోంది.

ఏమ‌యినా టీమ్ 2019 అంటూ బాబు చేసిన సెల‌క్ష‌న్ త‌ప్పిదాలు త‌ల‌నొప్పిగా మారుతున్నాయి. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న‌ట్టు ఇప్పుడు ఆయా మంత్రుల తీరు చూసి బాబు బాధ‌ప‌డినా ప్ర‌యోజ‌నం క‌నిపించేలా లేదు. దాంతో ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఎన్నిక‌ల సంవ‌త్స‌రంలో ఎలా అనే ప్ర‌శ్న ఆయ‌న్ని వేధిస్తోంది. కీల‌క నేత‌లు స్పందించ‌క‌పోవ‌డం, క్యాబినెట్ లో ఉన్నవాళ్ల‌కు ప‌ట్టు లేక‌పోవ‌డంతో టీడీపీ వ్య‌వ‌హారం అస‌లుకే ఎసరు పెడుతుందా అనే అనుమానం బ‌ల‌ప‌రుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter