బ్రాహ్మ‌ణ కార్పోరేష‌న్ చైర్మ‌న్ పై టీడీపీ ఎదురుదాడి

0e856081-5a00-4a1d-a942-7bc85774fee0

ఏపీ బ్రాహ్మ‌ణ కార్పోరేష‌న్ చైర్మ‌న్ ఐవీఆర్ కృష్ణారావు కొద్దికాలం క్రితం వ‌ర‌కూ చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌నిచేశారు. ఆత‌ర్వాత రిటైర్ కావ‌డంతో ప్ర‌స్తుతం నామినేటెడ్ పోస్టులో బ్రాహ్మ‌ణ కార్పోరేష‌న్ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. చాలాకాలం పాటు చంద్ర‌బాబు కి స‌న్నిహితంగా ఉండ‌డంతో ఆయ‌న‌కు ఈ ప‌ద‌వి ద‌క్కింది. అయితే రెండు నెల‌ల క్రితం మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ త‌ర్వాత ఐవీఆర్ కృష్ణారావుకి, చంద్ర‌బాబు మధ్య గ్యాప్ వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. దాంతో చంద్ర‌బాబుకి వ్య‌తిరేకంగా ఐవీఆర్ సొంత ఫేస్ బుక్ వాల్ మీద పోస్టులు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. అంత‌కుముందు కూడా ఆయ‌న బ‌హిరంగంగానే ప్ర‌భుత్వ విధానాల వైఫల్యాన్ని నిర‌సించారు. ఇప్పుడు నేరుగా సోష‌ల్ మీడియాలో చంద్ర‌బాబుని విమ‌ర్శించే పోస్టులు క‌నిపిస్తుండ‌డం క‌ల‌క‌లం రేగింది.

ఈ విష‌యం గ‌మ‌నించిన టీడీపీ శ్రేణులు భ‌గ్గుమంటున్నాయి. రిటైర్ అయిన త‌ర్వాత ప‌ద‌వి ఇచ్చి, గౌర‌వంగా ఉన్న‌త స్థానం క‌ట్ట‌బెడితే చంద్ర‌బాబు మీద దుమ్మెత్తిపోయ‌డం ఏంట‌ని అధికార పార్టీ ఆన్ లైన్ కార్య‌క‌ర్త‌లు నిల‌దీస్తున్నారు. ఐవీఆర్ మీద ఎదుర‌దాడి చేస్తున్నారు. అయితే తొలుత ఈ పోస్టుల వ్య‌వ‌హారమంతా అకౌంట్ హ్యాక్ కావ‌డంతో జ‌రిగిన పొర‌పాటుగా భావించిన‌ప్ప‌టికీ తాజాగా మాత్రం టీడీపీ తీరు మారిన‌ట్టు క‌నిపిస్తోంది. చంద్ర‌బాబుకి వ్య‌తిరేకంగా ఐవీఆర్ వాల్ మీద క‌నిపిస్తున్న పోస్టుల‌న్నీ ఉద్దేశ్య‌పూర్వ‌కంగానే పెట్టిన‌విగా భావిస్తున్నారు. దాంతో ఇప్పుడీ వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపుతోంది.

దాదాపు తెలుగుదేశం కార్య‌క‌ర్త‌గానే ప‌నిచేసిన ఈ మాజీ ఐఏఎస్ అధికారి తీరులో వ‌చ్చిన మార్పు అధికార పార్టీలో అల‌జ‌డి రేపుతోంది. బ్రాహ్మ‌ణ కార్పోరేష‌న్ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న ఆయ‌న‌కు త‌గిన గౌర‌వం ద‌క్క‌లేద‌నే అభిప్రాయంతో ఉన్నార‌నే వాద‌న వినిపిస్తోంది. బ్రాహ్మ‌ణుల‌కు ఏపీ క్యాబినెట్ లో అవ‌కాశం క‌ల్పిస్తార‌ని ఆశించిన ఆయ‌న‌, దానికి భిన్నంగా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించ‌డంతో గుర్రుగా ఉన్న‌ట్టు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే జ‌రుగుతున్నీ ఆన్ లైన్ వ్య‌వ‌హారం మీద ఆయ‌నెలా స్పందిస్తార‌న్న‌ది చూడాలి. ఐవీఆర్ స్పందించిన త‌ర్వాత టీడీపీ వ్య‌వ‌హారాలు కొత్త ప‌రిణామాలకు దారితీయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter