వైఎస్ ఇమేజ్ ని టార్గెట్ చేసిన బాబు..!

cbn-ysr-pic-667-01-1472710978

చంద్ర‌బాబు రూటు మార్చారు. త‌న మాజీ స‌హ‌చ‌రుడు, దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి నుంచి గుణ‌పాఠాలు నేర్చుకున్న‌ట్టు క‌నిపిస్తున్నారు. ఇమేజ్ సంపాదించ‌డంలో త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ను ప్ర‌ద‌ర్శించిన వైఎస్సార్ ను ఇప్పుటి సీఎం చంద్ర‌బాబు ఆద‌ర్శంగా తీసుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. తాజాగా చంద్ర‌బాబు అడుగులు గ‌మ‌నిస్తే ఆ విష‌యం తేట‌తెల్ల‌మ‌వుతోంది.

ఎన్నిక‌ల‌కు ముందు రుణ‌మాఫీ.. ఆత‌ర్వాత రాజ‌ధాని నిర్మాణం అంటూ హోరెత్తించిన చంద్ర‌బాబు ఇప్పుడు వాటికి బిన్నంగా సాగుతున్నారు. సాగునీటి చుట్టూ తిరుగుతున్నారు. త‌న‌కు ప్ర‌ధానాస్త్రం ప‌ట్టిసీమ అవుతుంద‌ని అంచ‌నా వేసిన ఆయ‌న దాని మీద ప్ర‌చారం కేంద్రీక‌రించారు. ఆత‌ర్వాత పోల‌వ‌రం కోసం సాధించిన పందొమ్మిది వంద‌ల కోట్ల రూపాయ‌లే పెద్ద విజ‌యంగా చెప్పుకున్నారు. 40వేల కోట్ల వ్య‌యంతో నిర్మించాల్సిన ప్రాజెక్ట్ కి ఈపాటి రుణం ఏ స‌రిపోతుంద‌న్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పుకుండానే వారంలో ఒక‌వారం పోల‌వ‌రం అంటూ పెద్ద‌స్థాయిలో ప్ర‌చారం సాగిస్తున్నారు. రాసి పెట్టుకో అంటూ ప్ర‌తిప‌క్ష నేత‌కు సూటిగానే చెప్పేశారు కూడా. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందే పోల‌వ‌రం ప్రాజెక్ట్ నుంచి నీటి విడుద‌ల జ‌రుగుతుంద‌ని ఘంటాప‌థంగా చెబుతున్నారు.

దానికితోడుగా పురుషోత్త‌ప‌ట్నం ఎత్తిపోత‌ల‌ను కూడా ఎత్తుకున్నారు. గోదావ‌రి, ఏలేరు న‌దుల అనుసంధానం అని చెబుతున్నారు. 5 నియోజ‌క‌వ‌ర్గాల‌ను స‌శ్య‌శ్యామ‌లం చేయ‌బోతున్న‌ట్టు శ‌ప‌థం చేసేశారు. అదే స‌మ‌యంలో పులివెందుల స‌హా సీమ మీద కూడా దృష్టి సారించారు. ముచ్చుమ‌ర్రి త‌ర్వాత పులివిందులకు కూడా నీటిని విడుద‌ల చేసిన ఎత్తిపోత‌ల ప‌థ‌కం త‌న విజ‌యంగా చెప్పుకుంటున్నారు. త‌ద్వారా తెలుగుదేశం హాయంలో అన్న‌దాత‌ల‌కు ఎంతో సాయం చేస్తున్న‌ట్టు చెప్పుకోవ‌డానికి ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. వ్య‌వ‌సాయం దండ‌గ అంటూ అప్ప‌ట్లో త‌న‌కు దూర‌మ‌యిన వ‌ర్గాల‌ను త‌న ద‌గ్గ‌రి నుంచి చెదిరిపోకుండా చూసుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా సాగుతున్నారు.

వైఎస్ ను ఆరాధించిన రైతుల్లో రుణ‌మాఫీ నినాదం బాగా ప‌నిచేసింది. అయితే దాని ఫ‌లితాలు చేదుగా ఉండ‌డంతో చంద్ర‌బాబు మీద కొంత వ్య‌తిరేక‌త పెరిగింది. దానిని గ‌మ‌నించిన‌ట్టే క‌నిపిస్తున్న ఏపీ సీఎం తాజాగా జ‌ల‌య‌జ్ఞం అంటే త‌న‌దేన‌నే రీతిలో చెప్పుకుంటున్నారు. ఆయ‌న్ని అప‌ర‌భ‌గీర‌ధుడంటూ టీడీపీ నేత‌లు కీర్తిస్తున్న ప‌రిస్థితి గుర్తిస్తే రైతుల‌కు మేలు చేసిన ఖ్యాతి త‌న‌దేన‌ని చెప్పుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. అదే స‌మ‌యంలో త‌న ప్ర‌య‌త్నాల‌ను అడ్డుకుంటున్నట్టు ప‌దే ప‌దే చెప్ప‌డం ద్వారా ప్ర‌తిప‌క్ష వైఎస్సార్సీపీని ప్ర‌జ‌ల్లో ప‌లుచ‌న చేయ‌డానికి ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. స‌రిగ్గా గ‌మ‌నిస్తే 2006-09 మ‌ధ్య వైఎస్ అనుస‌రించిన వ్యూహాన్ని ఇప్పుడు బాబు ప‌దును పెట్టి ప్ర‌యోగిస్తున్నారు. మ‌రి ఫ‌లితాలు ఎలా ఉంటాయో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter