రివ్యూ 2016: చంద్ర‌బాబుకి ఏమ‌య్యింది..?

cbn

ఏపీ సీఎం చంద్ర‌బాబుకి ఈ ఏడాది మిశ్ర‌మ ఫ‌లితాలే ద‌క్కాయి. కీల‌కాంశాల‌లో కొంత ఇబ్బందిక‌ర వాతావ‌ర‌ణ‌మే క‌నిపించింది. ప‌లు స‌మ‌స్య‌ల‌తోనే కొత్త ఏడాదిలో అడుగుపెట్టాల్సి వ‌స్తోంది. వ‌చ్చే ఏడాదిలో ఏం జ‌రుగుతుందోన‌నే ఆందోళ‌న ఆయ‌న‌లో, పార్టీలో ఆవ‌రిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఈ ఏడాది చంద్రబాబు ల‌క్ష్యాలు నెర‌వేర‌లేదు. అనుకున్న‌వేమీ జ‌ర‌గ‌లేదు. అందులో కీల‌క‌మైన‌ది అమ‌రావ‌తి. గ‌డిచిన సంవ‌త్స‌రంలో ఆడంబ‌రంగా శంకుస్థాప‌న నిర్వ‌హించిన‌ప్ప‌టికీ ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌లేదు. తాత్కాలిక సెక్ర‌టేరియేట్ కూడా అదే ప‌రిస్థితి. ప‌లుమార్లు ప్రారంభోత్స‌వాలు సాగినా ఇప్ప‌టికీ పూర్తికాలేదు. అసెంబ్లీ స‌మావేశాలు వెల‌గ‌పూడి లో నిర్వ‌హిస్తామ‌ని చెప్పిన‌ప్ప‌టికీ వ‌ర్షాకాలం వాయిదా ప‌డి, శీతాకాలం అస‌లు స‌మావేశాలు లేకుండా సాగిపోతోంది. ప‌క్క‌నే ఉన్న తెలుగు రాష్ట్రంలో స‌మావేశాలు పొడిగించి స‌ర్కారు హూందాగా వ్య‌వ‌హ‌రిస్తుంటే ఏపీలో మాత్రం చాలా ఏళ్ల త‌ర్వాత అస‌లు శీతాకాల అసెంబ్లీ స‌మావేశాల‌న్న‌వే లేకుండా పోయింది. ప్ర‌భుత్వం ఓ వైపు పెండింగ్ లో ఉన్న మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌కు వెళ్ల‌లేక‌పోయ‌వ‌డ‌మే కాకుండా ఆఖ‌రికి అసెంబ్లీ స‌మావేశాల‌కు కూడా సిద్ధం కాలేక‌పోవ‌డం స‌ర్కారు బ‌ల‌హీన‌త‌కు నిద‌ర్శ‌నంగా నిలిపిచిపోయింది. ప‌ట్టిసీమ పూర్తికావ‌డం, పోల‌వ‌రం కాంక్రీట్ ప‌నులు ప్రారంభించడం చంద్ర‌బాబు స‌ర్కారు ఈ ఏడాదిలో సాధించిన ప్ర‌ధాన విజ‌యాలుగా భావించ‌వ‌చ్చు.

ఇక కొన్ని కీల‌క స‌మ‌స్య‌లు చంద్ర‌బాబు నెత్తిన వ‌చ్చి ప‌డ్డాయి. గ‌డిచిన ఎన్నిక‌ల్లో సంజీవిని లా ప‌నిచేసిన ప్ర‌త్యేక హోదా ఇప్ప‌టికీ ఆవిర‌యిపోయింది. ప్యాకేజీ అంటూ పెద్ద ప్ర‌హ‌స‌నం న‌డిపిన‌ప్ప‌టికీ చ‌ట్ట‌బ‌ద్ధ లేకుండా వెక్కిరిస్తోంది. దానికితోడు రైల్వేజోన్, క‌డ‌ప ఉక్కు ఫ్యాక్ట‌రీ వంటి అనేక విభ‌జ‌న హామీలు ఎందుకూ కొర‌గాకుండా ఉన్నాయి. దాంతో ప్ర‌జ‌ల్లో అసంతృప్తి పెరుగుతోంది. వాట‌న్నంటికీ తోడుగా నోట్ల మార్పిడి వ్య‌వ‌హారం లో చంద్ర‌బాబు పిల్లిమొగ్గ‌లు వేయ‌డం అప‌హాస్యం పాలుజేసింది. సీఎంల క‌మిటీకి అధ్య‌క్షుడ‌ని చెప్పిన‌ప్ప‌టికీ అస‌లా క‌మిటీ జాడే క‌నిపించ‌డం లేదు. మ‌రోవైపు రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదాయం మ‌రింత ప‌డిపోతూ అప్పుల బారం పెరిగిపోతోంది. మూడేళ్ల‌లోనే ఏపీ ప్ర‌భుత్వ అప్పులు రెట్టింపు కావ‌డం గ‌మ‌నిస్తే బాబు పాల‌న ప‌రిస్థితి తేట‌తెల్ల‌మ‌వుతోంది.

వ్య‌క్తిగ‌తంగా చంద్ర‌బాబుకి ఈ ఏడాది కొంచెం తీపి, కొంచెం వ‌గ‌రు అన్న చందంగా ఉంది. హెరిటేజ్ లాభాలు పెర‌గ‌డం, నోట్ల మార్పిడికి ముందే ఫ్యూచ‌ర్ గ్రూప్ కి అమ్మ‌కాలు పూర్తికావ‌డం వంటి కొన్ని వ్య‌క్తిగ‌త లాభాలు చేకూరాయి. అదే స‌మ‌యంలో ఓటుకు నోటు వ్య‌వ‌హారం వెంటాడుతూ న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. ఒక త‌న‌యుడు లోకేష్ ను ప్ర‌మోట్ చేయ‌డానికి చేసిన ప్ర‌య‌త్నాలు కూడా ఫ‌లించ‌లేదు. పార్టీ నేత‌లు కొంద‌రు అనివార్యంగా అంగీక‌రిస్తున్న‌ప్ప‌టికీ శ్రేణుల్లో త‌గిన గుర్తింపు సాధించ‌లేక‌పోతున్నారు. మంత్రివ‌ర్గం లో చేర్చుకోవాలంటూ కొంద‌రు మ‌హానాడులో చేసిన హంగామా కి బాబు ముగింపు ప‌ల‌క‌లేక‌పోయారు. అదే స‌మ‌యంలో విప‌క్ష నేత కేసులు కూడా కొలిక్కి రాక‌పోవ‌డంతో బాబుకి నిరాశ క‌లుగుతోంది. వెంక‌య్య‌తో సాన్నిహిత్యం బ‌ల‌ప‌డిన‌ప్ప‌టికీ మోడీతో మితృత్వం మ‌రింత ప‌లుచ‌నయ్యింది. జ‌న‌సేనాని కూడా దూర‌మ‌వుతున్నారా అన్న సందేహాలు ఏర్పాడ్డాయి.

ఇక పార్టీ ప‌రంగా ఏకంగా 21మంది విప‌క్ష ఎమ్మెల్యేలు చేర‌డం టీడీపీకి బ‌ల‌మా..వ‌ర‌మా అన్న‌ది చెప్ప‌లేని సందిగ్ధం కొనసాగుతోంది. అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ్ముళ్లు రోడ్డున ప‌డుతుండ‌డంతో పార్టీ ప‌రువు బ‌జారుకెక్కుతోంది. బీజేపీ పునాదులు సైతం క‌దిలిపోయే ప‌రిస్థితి వ‌స్తుండ‌డంతో ఏపీలో పెనుభారం మోయాల్సిన స్థితి త‌ప్ప‌దేమో అనిపిస్తోంది. ఇక జ‌న‌సేన దూర‌మ‌వుతున్న సంకేతాలున్నాయి. రాజ‌కీయంగా ఒంటిర‌త‌న‌మేనా అన్న అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి. కాపుల్లో ప‌ట్టు కోల్పోవ‌డం, బీసీల‌లో కూడా అసంతృప్తి మొద‌లుకావ‌డం టీడీపీకి చిక్కులు తెచ్చిపెట్టే ప‌రిస్థితి ఈ ఏడాది క‌నిపించింది. దాంతో మొత్తంగా కొత్త ఏడాదిలో ప‌లు స‌వాళ్లు చంద్ర‌బాబు ముందు క‌నిపిస్తున్నాయి. ముంద‌స్తు సూచ‌న‌లు క‌నిపిస్తున్న త‌రుణంలో ఎంత‌టి ముందు చూపు ప్ర‌ద‌ర్శిస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter