అవినీతిలో అనిత హ‌స్తం..?

TDP MLA Anitha

అసెంబ్లీలో విప‌క్షం మీద విరుచుకుప‌డ‌డంలోనే కాకుండా, ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టే సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌ల మీద కేసులు పెట్ట‌డంలో సిద్ధ‌హ‌స్తురాలిగా మారిన పాయ‌క‌రావుపేట ఎమ్మెల్యే వ్య‌వ‌హారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఆమె సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఓ భారీ భూ కుంభ‌కోణం తెర‌మీద‌కు రావ‌డంతో అందులో అనిత హ‌స్తం మీద ఆసక్తిక‌ర క‌థ‌నాలు వ‌స్తున్నాయి. విశాఖ జిల్లా భూకుంభ‌కోణంలో త‌వ్వేకొద్దీ బ‌య‌ట‌ప‌డుతున్న వాస్త‌వాల‌ను ఒక వ‌ర్గం మీడియా దాచిపెట్టే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ప్ప‌టికీ విష‌యం మాత్రం దాచ‌డం సాధ్యం కావ‌డం లేదు.

అందుకు త‌గ్గ‌ట్టుగానే అనిత వ్య‌వ‌హారం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఇప్ప‌టికే భూకుంభ‌కోణంలో మంత్రి గంటా పాత్ర అంద‌రికీ క‌నిపిస్తోంది. ఆయ‌న మీదే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. చివ‌ర‌కు మంత్రి అయ్య‌న్న‌, బీజేపీ ఎల్పీ నాయ‌కుడు విష్ణుకుమార్ రాజు కూడా గంటా మీద గురిపెట్టారు. అదే స‌మ‌యంలో గంటాతో స‌న్నిహితంగా మెలుగుతున్న అనిత క‌థ ముందుకురావ‌డం మ‌రింత ఆస‌క్తిగా మారుతోంది. అనిత సొంత నియోజ‌క‌వ‌ర్గం న‌క్క‌ప‌ల్లి మండ‌లంలోని బంగార‌య్య‌పేట‌లో ప్ర‌భుత్వ భూమిని ప్ర‌భుత్వానికే అమ్మేసిన ఘ‌న‌త‌లో టీడీపీ యువ‌నాయ‌కుడి పేరు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. రికార్డుల‌తో స‌హా గ‌యాళ్ భూముల‌ను తారుమారుచేసి త‌మ పేరు రాయించుకోవ‌డం ద్వారా న‌ష్ట‌ప‌రిహారం నొక్కేసిన వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపుతోంది. కేంద్ర మ‌త్స్య‌శాఖ ఆధ్వ‌ర్యంలో ప‌రిశోధ‌నా కేంద్రం ఏర్పాటు కోసం చేసిన ప్ర‌య‌త్నాల‌ను సొమ్ము చేసుకుంటూ ఏకంగా 80ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారాన్ని ప్ర‌భుత్వ భూమికే ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర తీసుకున్న వ్య‌వ‌హారంలో టీడీపీ అధికార ప్ర‌తినిధిగా ఉన్న గోసాల శ్రీకాంత్ ప్రాధాన పాత్ర‌ధారిగా ఉన్నారు.

ఆయ‌న అనిత అనుచ‌రుడు కావ‌డంతో ఎమ్మెల్యే అనిత అండ‌దండ‌ల‌తోనే అధికారులు రికార్డులు తారుమారు చేసి ఉంటార‌ని చెబుతున్నారు. హుద్ హుద్ ముందూ, త‌ర్వాత జ‌రిగిన వ్య‌వ‌హారాల్లో ప్ర‌భుత్వ భూముల్లో సాగుదారుల‌కు చూపించుకుని స‌ర్కారు సొమ్ము మింగేసిన వ్య‌వ‌హారం ఇప్పుడు పాయ‌క‌రావుపేట‌లో ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తోంది. పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. స‌ర్వే నెంబ‌ర్ 202లోని మొత్తం 75 ఎక‌రాల స‌ర్కారు భూముల్లో 30 ఎక‌రాల‌ను త‌మ పేరుతో మ‌ళ్లించుకుని నిధులు కాజేసిన వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపుతోంది. ప్ర‌భుత్వ భూముల్లో ప్ర‌భుత్వ సంస్థ‌ల నిర్మాణం కోసం తెలుగుత‌మ్ముళ్ల కు ప్ర‌జాధ‌నం క‌ట్ట‌బెట్ట‌డం వెనుక ఉన్న కుట్ర మీద‌, ఈ వ్య‌వ‌హారంలో అనిత స‌హా టీడీపీ పెద్ద‌ల పాత్ర మీద విచార‌ణ జ‌ర‌పాల‌నే డిమాండ్ వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter