తెలుగు మీడియా తీరు మార‌దా..?

media

పాత్రికేయం ప్ర‌జ‌ల ప‌క్షం ఉండాలి. క‌నీస ప్ర‌మాణాల‌యినా పాటిస్తూ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించాలి. కానీ తెలుగు మీడియా తీరు దానికి భిన్నం. ప్ర‌జా స‌మ‌స్య‌లు కూడా పాల‌కుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌నంత వ‌ర‌కు మాత్ర‌మే మాట్లాడ‌డం, విధానాల వైప‌ల్యాల‌ను ప్ర‌శ్నించే ప‌రిస్థితి లేక‌పోవ‌డం, చివ‌ర‌కు లోపాలు బ‌య‌ట‌ప‌డినా క‌ప్పిపుచ్చ‌డానికి రంగంలో దిగ‌డం తెలుగు మీడియా కీల‌క క‌ర్త‌వ్యంగా క‌నిపిస్తోంది. అందుకే అనేక ప్ర‌జా స‌మ‌స్య‌లు ప్ర‌స్తావించ‌క‌పోయినా, క‌నీసం పాల‌కుల వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల ముందుకు తీసుకొస్తార‌ని భావించిన వారికి నిరాశ ఎదుర‌వుతోంది. దానికి మించి మ‌సిపూసి మారేడు కాయ చేసే ప్ర‌య‌త్నంలో ఉన్న మీడియా పెద్ద‌ల తీరుతో ఆగ్ర‌హం క‌నిపిస్తోంది.

మీడియా స్వేచ్ఛ అంటే యాజ‌మాన్యాల స్వేచ్ఛేన‌ని చాలాకాలంగా వినిపిస్తున్నది ఇప్పుడు రూఢీ అవుతోంది. తెలుగుమీడియాలో మూడింట రెండు వంతులు ఒకే వ‌ర్గం పెత్త‌నం సాగిస్తోంది. ప‌త్రికలు, చానెళ్ల‌లో ఒక్క సామాజిక‌వ‌ర్గానిదే ఆధిప‌త్యం. ఆ వ‌ర్గానికే చెందిన వారి అధికారం కాపాడ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌న్న‌ట్టుగా ఇప్పుడు మీడియా పెద్ద‌ల వ్య‌వ‌హారం క‌నిపిస్తోంది. వాటికితోడుగా ప్ర‌భుత్వం ఇస్తున్న ప్ర‌క‌ట‌నల ఆశ‌లో మ‌రికొంద‌రు ఎంత‌కైనా తెగించే ప‌నిలో ప‌డ్డారు. గ‌డిచిన ప‌క్షం రోజులుగా ఏపీ ప‌రిణామాలు గ‌మ‌నిస్తే ఇది అర్థ‌మ‌వుతుంది. అందులోనూ సోష‌ల్ మీడియా మూలంగా అనేక విష‌యాలు నిత్యం వెలుగులోకి వ‌స్తున్నా ఎక్క‌డా వెన‌క‌డుగు వేయ‌డంలేదు.

తాజాగా విశాఖ భూముల కుంభ‌కోణం విష‌యంలో మీడియా వాస్త‌వాలు తెలియ‌జేయ‌క‌పోయినా అబ‌ద్ధాల‌ను ప్ర‌శ్నించాల్సి ఉంది. అందులోనూ క‌లెక్ట‌ర్ స్థాయి వ్య‌క్తులు మాట మార్చేయ‌డం వ్య‌వ‌స్థ‌లో నిస్సిగ్గుత‌నం ఏ స్థాయిలో ఉందో చెబుతోంది. అయినా మీడియా క‌నీసం ప్ర‌శ్నించ‌లేని ప‌రిస్థితిలో ఉండ‌డం వెనుక పాల‌కుల ప్రాప‌క‌మే ప్ర‌ధానంగా మారిన వాస్త‌వాన్ని చెబుతోంది. భారీగా ట్యాంప‌రింగ్ జ‌రిగింద‌ని, 20వేల ఎక‌రాల వ‌ర‌కూ ప్ర‌భుత్వ భూముల‌కు ఎగ‌నామం పెట్టార‌ని చెప్పిన ఐఏఎస్ అధికారి, ఆత‌ర్వాత నారా లోకేష్ విశాఖ ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌గా మాట మార్చి 200 ఎక‌రాల రికార్డులు మాత్ర‌మే మాయ‌మ‌య్యాయ‌ని చెప్ప‌డం రికార్డెడ్ గా ఉన్నా నిల‌దీయ‌లేని మీడియా వ్య‌వ‌హారం ప‌క్కా మోస‌కారి రూపాన్ని త‌ల‌పిస్తోంది.

అంత‌కుమించిన దారుణం అసెంబ్లీకి చిల్లు ప‌డిన వ్య‌వ‌హారంలో క‌నిపిస్తోంది. ఘ‌ట‌న జ‌రిగిన కొన్ని గంట‌ల్లోనే అక్క‌డికి వెళ్లిన సీఆర్డీయే క‌మిష‌న‌ర్ చెప్పిన మాట‌ల‌కు, ఆ మ‌రుస‌టి రోజు స్పీక‌ర్ చెప్పిన భాష్యాల‌కు పొంత‌న‌లేద‌న‌డానికి పెద్ద‌గా ఆలోచించాల్సిన అవ‌స‌రం లేదు. చివ‌ర‌కు ఈ వ్య‌వ‌హారంలో కుట్ర‌ల కోణాల‌న్నింటిలో ఎలుక‌లే దోషుల‌న్న‌ట్టుగా చెప్ప‌డానికి కూడా అధికార యంత్రాంగం దిగ‌జారుతున్నా మీడియా మాత్రం త‌న స‌హ‌జ‌ధోర‌ణి వీడ‌కుండా ప్ర‌జాధ‌నం ఏమ‌యినా ఫ‌ర్వాలేద‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌డం ప్ర‌మాద‌సంకేతంగానే భావించాలి. గంట‌గంట‌కు మాట మార్చేస్తున్నా మౌనంగా మీడియా ఉండ‌డం, అదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించ‌డానికి అహ‌ర్నిశ‌లు శ్ర‌మించ‌డం నాలుగోస్తంభం మూలంగా వ్య‌వ‌స్థ మ‌రింత దిగ‌జారుతుంద‌న‌డానికి నిద‌ర్శ‌నంగా ఉన్నాయి.

తెలుగు మీడియా ఇప్ప‌టికే ప‌త‌న‌స్థాయికి చేరుకుంద‌న‌డానికి మ‌రో ఉదాహ‌ర‌ణ‌గా కాకినాడ‌లో జ‌రిగిన వ్య‌వ‌హారం తేట‌తెల్లం చేస్తోంది. మ‌హాసంక‌ల్పం అంటూ చంద్ర‌బాబు ప్ర‌చార ప‌టోటాపానికే తెలుగు మీడియా వంత పాడ‌గా, అదే న‌గ‌రంలో అంబులెన్స్ విష‌యంలో చంద్ర‌బాబు తీరు మూలంగా రోగులు ప‌డిన ఇబ్బందుల‌ను నేష‌న‌ల్ మీడియా వెలుగులోకి తీసుకురావ‌డం విశేషం. జాతీయ స్థాయిలో చంద్ర‌బాబు వీఐపీ సంస్కృతి మూలంగా క‌లిగిన ఇబ్బందులు చ‌ర్చ‌నీయాంశ‌మ‌యినా తెలుగు గ‌డ్డ మీద జ‌రిగిన ఘ‌ట‌న‌ను తెలుగు ప్ర‌జ‌ల‌కు తెలియ‌కుండా చేయాల‌నే తెలుగు మీడియా త‌ప‌న వారి ప‌త‌నానికి ప‌రాకాష్ట‌గా చెప్ప‌వ‌చ్చు. అందుకే ఇప్పుడు తెలుగు మీడియా తీరును అంతా త‌ప్పుబ‌ట్టే ప‌రిస్థితి వ‌చ్చేసింది. విశ్వ‌స‌నీయ‌త‌లేని వ్య‌వ‌స్థ త్వ‌ర‌గానే హాస్యాస్ప‌దంగా మారిపోతోంది. అదే జ‌రిగితే ప్ర‌జాస్వామ్యానికి పెనుప్ర‌మాద‌మే అని చెప్ప‌క త‌ప్ప‌దు. మీడియా ఏక‌ప‌క్షంగా అధికారంతో అంట‌కాగితే అది అనేక అన‌ర్థాల‌కు సంకేతంగా భావించ‌క త‌ప్ప‌దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter