సోష‌ల్ మీడియా కోసం చంద్ర‌బాబు త‌హ‌త‌హ‌

social-media-graphic2

గ‌తంలో ఎన్నిమాట‌లు చెప్పినా ఏపీ సీఎం చంద్ర‌బాబుకి కూడా సోష‌ల్ మీడియా ప‌వ‌ర్ ఏంటో అర్థ‌మ‌య్యింది. నియంత్రిస్తామ‌ని చెప్పిన నేత‌లే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో నిల‌దొక్కుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌భుత్వం సొమ్ముతో చంద్ర‌బాబుకి సానుకూల ప్ర‌చారం కోసం స‌న్నాహాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే ఉన్న విభాగాల‌కు తోడుగా అద‌నంగా మ‌రో కొత్త వింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను, ప్ర‌జ‌ల‌కు అందుతున్న ప్ర‌యోజ‌నాల‌కు, వివిధ స్కీమ్స్ ల‌క్ష్యాల‌ను, అందుకోవ‌డానికి త‌గ్గ‌ట్టుగా ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డం కోసం కొత్త‌గా సోష‌ల్ మీడియాలో ఓ బృందాన్ని సిద్ధం చేస్తోంది. 20మంది స‌భ్యుల‌తో కొత్త విభాగం ఏర్పాటు కాబోతోంది.

తాజాగా జ‌రిగిన మంత్రివ‌ర్గ స‌మావేశంలో ఈ మేరకు నిర్ణ‌యం తీసుకున్నారు. సిబ్బంది వేత‌నాల కోసం ఖ‌జానా నుంచి 8 కోట్లు కేటాయించాల‌ని నిర్ణ‌యించారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ నిర్ణ‌యం ఆస‌క్తిగా మారింది. రెండు నెల‌ల క్రితం పెద‌బాబు-చిన‌బాబు మీద సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాల‌తో అవాక్క‌యిన టీడీపీ పెద్ద‌లు సోష‌ల్ మీడియా మీద క‌న్నెర్ర చేశారు. పార్టీ నేత‌లే ఫిర్యాదు చేశారు. ఏకంగా ఎమ్మెల్యే అనిత మ‌రో అడుగు ముందుకేసి ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు. ఆ ఫిర్యాదుల్లో భాగంగా ఇద్ద‌రు వైసీపీ ఫాలోవ‌ర్స్ ని అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

దానికి కొన‌సాగింపుగా నారా లోకేష్ స్వ‌యంగా జోక్యం చేసుకుని సోష‌ల్ మీడియా నియంత్ర‌ణ కోసం ఆలోచించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యింది. ప్ర‌భుత్వ విధానాల లోపాన్ని ఎత్తిచూపిన వాళ్ల మీద క‌క్ష గ‌ట్ట‌డం త‌గ‌ద‌నే వాద‌న వినిపించింది. దాంతో వెన‌క‌డుగు వేసిన బాబు ఇప్పుడు సోష‌ల్ మీడియాను తాము కూడా వినియోగించుకోవాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఇటీవ‌ల మ‌హానాడులో కూడా పార్టీ కార్య‌క‌ర్త‌లంతా ఎఫ్ బీ అకౌంట్లు ఓపెన్ చేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ప్ర‌భుత్వ ప్ర‌చారం కోసం ప్ర‌త్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేస్తూ భారీగా నిధులు కూడా కేటాయించారు.

త‌ద్వారా ప్రింట్, ఎల‌క్ట్రానిక్ మీడియాల మాదిరే సోష‌ల్ మీడియాలో కూడా ప్ర‌భుత్వ ముద్ర క‌నిపించేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్టు క‌నిపిస్తోంది. కానీ ప‌రిస్థితి దానికి భిన్నంగా ఉంద‌న్న‌ది కాద‌న‌లేని స‌త్యం. ఎంత‌గా అణ‌చాల‌నిచూసినా సోష‌ల్ మీడియాలో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త త‌గ్గ‌లేదు. త‌గ్గే అవ‌కాశం కూడా క‌నిపించ‌డం లేదు. దానిని ఎదుర్కోవ‌డం, ప్ర‌భుత్వ అనుకూల‌త పెంచ‌డానికి ప్ర‌య్నించ‌డం ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో క‌త్తిమీద సాములాంటిదే. అయినా చంద్ర‌బాబు అలాంటి ప్ర‌య‌త్నం మొద‌లుపెట్టారు కాబ‌ట్టి ఫ‌లితాలు ఎలా ఉంటాయో చూడాలి. అయితే ఒక‌టి మాత్రం వాస్త‌వం ఏమంటే 2014 ఎన్నిక‌ల‌కు ముందు సోష‌ల్ మీడియాలో టీడీపీ శ్రేణులు చెల‌రేగిపోతే, ఇప్పుడు వైసీపీ అనుచ‌రుల హ‌వాకు అడ్డు క‌నిపించడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter