గంటాకి వైసీపీ వంత‌పాడుతోందా..?

ganta srinivas

అనుమానం అయితే ఉంది. నిజ‌మా..కాదా అన్న‌ది వైసీపీ నేత‌లే చెప్పాలి. వాస్త‌వానికి విశాఖ‌లో భూక‌బ్జాల వ్య‌వ‌హారం దేశంలోనే అతిపెద్ద‌దిగా విప‌క్షం చెబుతోంది. విజ‌య‌సాయి రెడ్డి పూర్తిగా ఈ వ్య‌వ‌హారం మీదే కేంద్రీక‌రించారు. పాల‌క‌పార్టీలోనూ లుక‌లుక‌లు బ‌య‌ట‌ప‌డుతుండ‌డంతో సాగ‌ర‌తీరంలో ప‌ట్టుకోసం శ్ర‌మిస్తున్న ఆయ‌న‌కు మంచి ఆయుధంగా మారింది. ప్ర‌జ‌లు కూడా ప్ర‌భుత్వ తీరు మీద సందేహప‌డేలా చంద్ర‌బాబు చ‌ర్య‌లుండ‌డంతో విప‌క్షానికి మ‌రింత ఊపు వ‌స్తోంది. క‌లెక్ట‌ర్ ది ఒక‌మాట‌, మినిస్ట‌ర్ ది మ‌రోమాట‌, రెవెన్యూ మంత్రిది ఓ మాట‌, ముఖ్య‌మంత్రిది మ‌రో మాట అన్న‌ట్టుగా ఉన్న వ్య‌వ‌హారంలో స‌ర్కారు తీరు పూర్తిగా సందేహాస్ప‌దంగా ఉండ‌డంతో సామాన్యుడు కూడా పాల‌కుల మాట‌ను విశ్వ‌సించ‌డం లేదు. విప‌క్షానికి కావాల్సింది అదే కాబ‌ట్టి మ‌రింత ఉత్సాహంగా సాగుతోంది.

అంత‌వ‌ర‌కూ బాగానే ఉంది. కానీ వైసీపీ నేత‌లంతా ఇదే విష‌యం మాట్లాడుతున్నా అధినేత నోరెందుకు మెద‌ప‌లేదా అనే ప్ర‌శ్న చాలామందిలో వినిపిస్తోంది. కుంభ‌కోణం బ‌య‌ట‌ప‌డిన‌ప్పుడు విదేశాల్లో ఉన్న జ‌గ‌న్ తెలుగుగ‌డ్డ మీద అడుగుపెట్టి వారం దాటినా విశాఖ వ్య‌వ‌హారాన్ని మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం వెనుక కారణాలు కాన‌రావ‌డం లేదు. గంటా శ్రీనివాస‌రావు, అయ్య‌న్న మ‌ధ్య మొద‌లైన వైరం చివ‌ర‌కు టీడీపీలో ఒక త‌ర‌గ‌తి త‌న‌వైపుకి వ‌చ్చే అవ‌కాశాలు మెరుగుప‌రుస్తుంద‌నే అంచ‌నాలో వైసీపీ అధిష్టానం ఉందా అనే అభిప్రాయం కూడా వ్యక్త‌మ‌వుతోంది. గ‌త ఎన్నిక‌ల ముందు ఫ్యాన్ పంచ‌న చేరాల్సి ఉన్న‌ప్ప‌టికీ చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌దం కాక‌పోవ‌డంతో గంటా సైకిలెక్కారు. మంత్రిగా ఉన్న‌ప్ప‌టికీ పూర్తిగా తెలుగుదేశం తీరుతో సంతృప్తిగా క‌నిపించ‌డం లేదు. దాంతో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న ఎలాంటి నిర్ణ‌యమ‌యినా తీసుకునే అవ‌కాశం మాత్రం ఉంది.

వాస్త‌వానికి గంటా ఇప్ప‌టివ‌ర‌కూ వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లో ఒకే సీటు నుంచి పోటీ చేసిన అనుభ‌వం లేదు. తొలుత అన‌కాప‌ల్లి ఎంపీగా రంగంలో దిగిన ఆయ‌న ఆత‌ర్వాత 2004లో చోడ‌వ‌రం నుంచి ఎమ్మెల్యేగానూ, 2009లో అన‌కాప‌ల్లి నుంచి ఎమ్మెల్యేగానూ గెలిచారు. 2014లో భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక‌యి క్యాబినెట్ లో కొన‌సాగుతున్నారు. ఇలా ప్ర‌తీ ఎన్నిక‌ల ముందు పార్టీ, సీటు మార్చేసే చ‌రిత్ర ఉన్న గంటా వ‌చ్చే 2019 నాటికి ఏ పార్టీ త‌రుపున ఎక్క‌డి నుంచి పోటీ చేసినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. అందుకే గంటా త‌మ ఇంట అడుగుపెట్ట‌డానికి త‌గ్గ‌ట్టుగా వైసీపీ వ్యూహం ర‌చిస్తుందా అనే వాద‌న ఆపార్టీ శ్రేణుల్లోనే మొద‌ల‌య్యింది. దానికి త‌గ్గ‌ట్టుగానే భీమిలిలో వైసీపీకి అంతో ఇంతో ప‌ట్టున్న సీనియ‌ర్ క‌ర్రి సీతారాం విష‌యంలో చిన్న‌చూపు ప్ర‌ద‌ర్శించిన‌ట్టుగా ఉంది. బ‌ల‌మైనా సామాజిక‌వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ స్థానంలో జూనియ‌ర్ మ‌హిళా నేత‌ను భీమిలి ఇన్ఛార్జ్ గా నియ‌మించ‌డం ద్వారా క‌ర్రి సీతారామ్ కి పొమ్మ‌న‌లేక పొగ‌పెట్టిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. దాంతో అది కూడా గంటా కోసం చేసిన ఏర్పాటుగానే కొంద‌రు భావిస్తున్నారు.

వాస్త‌వానికి గంటా ఇప్ప‌టికే తెలుగుదేశంలో అధినేతకు సైతం మింగుడుప‌డ‌డం లేదు. ఆయ‌న‌కు బ‌లంగా ఉన్న కులం కార్డ్ కార‌ణం బాబు సైతం ఏమీ అన‌లేని స్థితిలో ఉంది. అయినా గానీ ఎన్నిక‌ల ముందు పార్టీ ప‌రిస్థితి బాగోలేద‌ని భావిస్తే, సొంత స‌ర్వేల ప్ర‌కారం అనుకూలంగా ఉన్న పార్టీలోకి గంటా జంప్ అయ్యే అవ‌కాశాలు ఎక్కువే. విశాఖ‌లో వైసీపీకి త‌గిన నాయ‌క‌త్వం లేదు. దాంతో పార్టీని న‌డిపించే సార‌ధి కోసం జ‌గన్ ఎదురుచూస్తున్నారు. గుడివాడ అమ‌ర్ నాథ్ వంటి వారి స్టామినా స‌రిపోద‌ని సందేహిస్తున్న జ‌గ‌న్ దానికి త‌గ్గ‌ట్టుగానే గంటా కోసం ముంద‌స్తు ఏర్పాట్ల‌లో ఉన్నార‌నే వారు కూడా ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు విశాఖ భూముల విష‌యంలో వైసీపీ ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇంత పెద్ద వ్య‌వ‌హారంలో జోక్యం చేసుకోవాల్సిన అధినేత అంటీముట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌డం కూడా అదే కార‌ణ‌మంటున్నారు. టీడీపీ నేత‌లు అడ్డంగా దొరికేసిన వ్య‌వ‌హారమే అయినా క‌నీసం విశాఖ వైపు చూడ‌కుండా పులివెందుల‌కు జ‌గ‌న్ ప‌య‌నం కావ‌డం వెనుక గంటా లాబీయింగ్ గ‌ట్టిగానే ప‌నిచేసి ఉంటుంద‌ని చెబుతున్నారు. లోగుట్టు పెరుమాళ్ల‌కెరుకే గానీ..వైసీపీ తీరు మాత్రం విస్మ‌య‌క‌ర‌మే.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter