బై పోల్స్ కి ముందే కోట్ల‌..!

kotla suryaprakash

క‌ర్నూలు జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేత కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి త్వ‌ర‌లోనే వైసీపీలో చేర‌తార‌నే ప్ర‌చారం ఊపందుకుంది. ఈ మాజీ కేంద్ర‌మంత్రి ప్ర‌స్తుతం కాంగ్రెస్ లో ఉన్న‌ప్ప‌టికీ అంత సంతృప్తిగా క‌నిపించ‌డం లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కోలుకునే సూచ‌న‌లు లేక‌పోవ‌డంతో రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం పార్టీ ఫిరాయించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మాజీ ముఖ్య‌మంత్రి త‌న‌యుడైన కోట్ల మ‌రో మాజీ సీఎం వైఎస్ త‌న‌యుడితో చేతులు క‌ల‌ప‌డం మిన‌హా మ‌రో మార్గం క‌నిపించ‌క‌పోవ‌డంతో ఆయ‌న వైసీపీలో చేర‌డం ఖాయం అని చాలాకాలంగా భావిస్తున్నారు. అయితే ఇక ఇప్పుడు ఆల‌శ్యం చేయ‌డం కంటే నంద్యాల ఉప ఎన్నిక‌ల‌కు ముందుగా ఈ వ్య‌వ‌హారం ముగిస్తే మంచిద‌నే ఆలోచ‌న‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డికి గ‌తంలో ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హించిన క‌ర్నూలు ఎంపీ సీటు కేటాయించ‌డానికి జ‌గ‌న్ సుముఖంగా ఉన్నారు. ప్ర‌స్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న బుట్టా రేణుక‌ను ఎమ్మ‌గ‌నూరు నుంచి అసెంబ్లీ బ‌రిలో దింప‌డానికి ఇప్ప‌టికే రంగం సిద్ధం చేశారు. దాంతో కోట్ల‌కు సీటు ఖాయంగా క‌నిపిస్తోంది. అయితే వీల‌యినంత త్వ‌ర‌గా పార్టీలో చేరితో అక్క‌డి ప‌రిస్థితులు అర్థం చేసుకోవ‌డ‌మే కాకుండా, క్యాడ‌ర్ తో స‌ఖ్య‌త పెంచుకోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని కోట్ల శిబిరం భావిస్తున్న‌ట్టు స‌మాచారం. అదే స‌మ‌యంలో వ‌చ్చే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల కోసం నంద్యాల‌ని గంగుల ప్ర‌తాప్ రెడ్డికి జ‌గ‌న్ క‌న్ఫ‌ర్మ్ చేశారు. కర్నూలు కూడా కోట్ల‌కు ఖాయం అయిపోతే సీనియ‌ర్ల‌తో జిల్లాలో పార్టీ మ‌రింత బ‌ల‌ప‌డుతుంద‌ని భావిస్తున్నారు.

దానికి మించి నంద్యాల ఇప్పుడు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డం అటు అధికార‌, ఇటు జ‌గ‌న్ పార్టీల‌కు అనివార్యంగా క‌నిపిస్తోంది. దానికి కార‌ణం అది వైసీపీ సిట్టింగ్ సీటు కావ‌డం, చ‌నిపోయే నాటికి భూమా టీడీపీలో ఉండ‌డమే. దాంతో ఇరుపార్టీలు ఇప్పుడు నంద్యాల చుట్టూ వేగంగా పావులు క‌దుపుతున్నారు. ఆ విష‌యంలో వైసీపీ ముందంజ‌లో ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు. అభ్య‌ర్థి విష‌యంలో టీడీపీలో ఉన్న స్ప‌ష్ట‌త వైసీపీలో క‌నిపించ‌డం లేదు గానీ, సీనియ‌ర్ల రాక‌తో , బ‌ల‌మైన క్యాడ‌ర్ తో వైసీపీలో ఉత్సాహం క‌నిపిస్తోంది. సామాజిక స‌మీక‌ర‌ణాలు కూడా త‌న‌కే అనుకూల‌మ‌ని అంచ‌నా వేస్తోంది. ఈ నేప‌థ్యంలో కోట్ల వంటి నేత‌లకు కూడా కండువాలు క‌ప్పేస్తే క‌ర్నూలు జిల్లాలో ప్ర‌త్య‌ర్థుల మీద నైతిక విజ‌యం సాధించ‌వ‌చ్చ‌నే అంచ‌నాలో లోట‌స్ పాండ్ ఉంది. వ‌రుస‌గా నేత‌ల చేరిక‌లు సాగితే త‌ద్వారా ప్ర‌జ‌ల్లో పార్టీ బ‌లం పెరుగుతుంద‌నే సంకేతాలు పంపించ‌డం సులువు అవుతుంద‌ని, న్యూట్ర‌ల్ ఓట‌ర్ల‌ను త‌మ‌వైపు మ‌ల‌చుకోవ‌చ్చ‌ని అంచ‌నా వేస్తోంది.

నంద్యాల అభ్య‌ర్థి ఎవ‌ర‌యినప్ప‌టికీ ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డానికి త‌గ్గ‌ట్టుగా పావులు క‌దుపుతున్న జ‌గ‌న్ అందులో భాగంగానే కోట్ల కోసం య‌త్నాలు ప్రారంభించిన‌ట్టు చెబుతున్నారు. దాంతో క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాలు కొత్త మ‌లుపు తిర‌గ‌డం ఖాయం. ఇప్ప‌టికే జిల్లాలో వైసీపీదే పై చేయిగా ఉంది. తాజాగా శిల్పా రాక‌, ఆత‌ర్వాత కోట్ల చేరిక వంటివి జ‌రిగితే నంద్యాల ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల మీద ప్ర‌భావం ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter